శబరిమల యాత్రికులకు కీలక హెచ్చరిక: మెదడు వాపు వ్యాధిపై కేరళ ప్రభుత్వ మార్గదర్శకాలు
శబరిమల మండల-మకరవిళక్కు సీజన్ అధికారికంగా ప్రారంభమైంది. ఆదివారం సాయంత్రం 5 గంటలకు అయ్యప్ప ఆలయ తలుపులు తెరుచుకోనున్నాయి. వృశ్చిక మాసం ఆరంభంతో ప్రారంభమయ్యే ఈ యాత్రకు భక్తులను సోమవారం తెల్లవారుజామున 3 గంటల తర్వాత దర్శనానికి అనుమతిస్తారు. అయితే, ఈ ఏడాది కేవలం ఆధ్యాత్మికంగానే కాక, ఆరోగ్య పరంగా కూడా భక్తులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది.
రాష్ట్రంలో ఇటీవల మెదడు వాపు వంటి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, ఆరోగ్య శాఖ ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. ముఖ్యంగా నది స్నానాలు చేసే సమయంలో ముక్కులోకి నీరు పోకుండా చూసుకోవాలని సూచించింది. కేరళలో అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ అనే ప్రమాదకర వ్యాధి కేసులు పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ వ్యాధి నీటిలో ఉండే హానికరమైన పరాన్నజీవుల (Amoeba) ద్వారా వ్యాపిస్తుందని, భక్తులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 69 కేసులు నమోదవగా, 19 మంది మరణించినట్లు సమాచారం.
ముఖ్య ఆరోగ్య సూచనలు:
-
పానీయాలు, ఆహారం: మరిగించిన నీటినే తాగాలి. బయట ఉంచిన లేదా సరిగ్గా శుభ్రం చేయని పండ్లను తినకూడదు.
-
నడక: కొండ మార్గంలో నెమ్మదిగా నడవడం, మధ్యలో విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం. అలసట లేదా శ్వాస ఇబ్బంది ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
-
వ్యక్తిగత పరిశుభ్రత: బహిరంగ మలవిసర్జన పూర్తిగా నిషేధించారు. టాయిలెట్లు, చెత్తబుట్టలనే వినియోగించాలి.
అత్యవసర వైద్య సహాయం కోసం 04735 203232 నంబర్‌కు కాల్ చేయాలని అధికారులు తెలిపారు. పాముకాటు ప్రమాదాలను ఎదుర్కోవడానికి కూడా ముందస్తు ఏర్పాట్లు చేశారు. యాత్ర మార్గాల్లో శిక్షణ పొందిన ఆరోగ్య సిబ్బంది, పంపాలో 24 గంటలూ పనిచేసే మెడికల్ క్యాంపులు, అవసరమైన మందులు, యాంటీ వీనం ఆసుపత్రుల్లో సిద్ధంగా ఉంచినట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది.
Comments (0)
No comments yet. Be the first to comment.
Please log in or register to post a comment.